ఈ అయిదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి.? : రేవంత్

Revanth Reddy Kodangal Visit. దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ లు కులాలు మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  27 Jan 2023 10:16 AM GMT
ఈ అయిదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి.? : రేవంత్

దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ లు కులాలు మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. దౌల్తాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంత‌రం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ.. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ గుండెకు, ప్రతీ ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇంటింటికి కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలని కార్య‌క‌ర్త‌లకు పిలుపునిచ్చారు.

2009 కంటే ముందు కొడంగల్ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. మీరు కష్టపడి నాటిన మొక్క.. ఒక వృక్షమై కోడంగ‌ల్‌కు ఓ గుర్తింపు తీసుకొచ్చింది.. వాస్తవం కాదా ఆలోచించండని అన్నారు. రావులపల్లి, మద్దూరు, కోయిల్ కొండ కు డబుల్ రోడ్డు తీసుకొచ్చాం.. కానీ కృష్ణా జలాలు తెస్తా అని చెప్పిన వాళ్లు.. కనీసం దౌల్తాబాద్ చెరువు తూము మూతపడితే తట్టెడు మట్టి తీయలేదు. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు లేదో.. కాంగ్రెస్ ఆ ఊర్లో ఓటు అడగదు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో.. ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా అని సవాల్ విసిరారు.

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప.. ఈ అయిదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి? అని ప్ర‌శ్నించారు. 119 నియోజకవర్గాల బీ ఫామ్ పై సంతకం పెట్టే అవకాశం సోనియా మనకు ఇచ్చారు. మన ఓటు మనం వేసుకుంటే.. ఎవరి దగ్గరా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉండదు. మన ఊర్లలో రైలు కూత వినిపించే బాధ్యత నేను తీసుకుంటా. నాపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్ కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కొడంగల్ ప్రజలకు నా చేతనైన సాయం చేశాను.. ఏ ఒక్కరి దగ్గర చేయి చాచలేదు. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కానీ ఇప్పుడు కొడంగల్ లో పరిస్థితి మారింది. ఏ పంచాయితీ అయినా బీఆర్ఎస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే.. దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజి తీసుకొస్తా అని హరీష్ రావు అన్నడు. మరి ఇప్పుడు కాలేజి ఎందుకు తేలేదు.. కేసీఆర్ కు కాళ్లు లేవా? అని ప్ర‌శ్నించారు.

స్థానిక నాయకులు ప్రతీ ఇంటికి తిరగండి. నేను పాదయాత్రలో ఉన్నా ఇక్కడి సమాచారం నాకు తెలుస్తుంది. మన చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దని స్థానిక నేత‌ల‌కు పిలుపునిచ్చారు.

Next Story