రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..
Revanth Reddy House Arrested By Police. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన
By Medi Samrat Published on 19 July 2021 8:58 AM ISTకోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే.. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేఫథ్యంలో.. సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కోకాపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రేవంత్‌ను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు. ఇది నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. రేవంత్ పార్లమెంట్ లో కోకాపేట అవినీతిని ఎండగడుతాడానే భయంతోనే పోలీసులు ఇలా అడ్డుకుంటున్నారని.. ఇది అప్రజాస్వామికం.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని రవి అన్నారు. ఈ నియంత, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మల్లు రవి వ్యాఖ్యానించారు. మరోవైపు కోకాపేట భూముల సందర్శనకు మాజీ ఉపముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారిని కూడా పోలీసుల అడ్డుకునే అవకాశముందని తెలుస్తోంది.