సికింద్రాబాద్ బోనాల సందర్బంగా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ చేసి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారు. స్వయం పాలనతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాజీవ్ విశ్వసించారు. గ్రామాలు బాగుపడితే దేశం బలంగా ఉంటుందని రాజీవ్ నమ్మారని.. కానీ రాజీవ్ గాంధీ ఏ మేలుకై అధికారాలు బదలాయించారో.. ఆ విధంగా తెలంగాణ లో అభివృద్ధి జరగడం లేదని రేవంత్ అన్నారు.
తెలంగాణలో అడుగడుగునా ప్రజలకు వివక్షే ఎదురవుతుందని రేవంత్ అన్నారు. రాబోయే 20 నెలల్లో తెలంగాణ కు పట్టిన పీడ వదలబోతుందని.. స్వయం పాలన, స్వేచ్ఛ కోసం కలలుగన్న తెలంగాణ ప్రజానీకం మరో మహోద్యమానికి సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డి చిరాగ్ పోర్ట్ సికింద్రాబాద్ లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ వెంట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు ఉన్నారు.