కల్లాల్లో రైతుల చావులు ప్రభుత్వ హత్యలే : రేవంత్ రెడ్డి
Revanth Reddy Fires On CM KCR. ఎత్తేసిన ధర్నా చౌక్ లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేసిండు.. టీఆర్ఎస్, బీజేపీ కలిసి
By Medi Samrat Published on 28 Nov 2021 11:33 AM GMTఎత్తేసిన ధర్నా చౌక్ లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేసిండు.. టీఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెరలేపారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సమస్యలు మాట్లాడుతామని చెప్పి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. సురేష్ రెడ్డి ఇంట్లో మందు తాగి విందు భోజనం చేసి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ మోదీని కలువలేదు.. అపాయింట్ మెంట్ అడగలేదని వ్యాఖ్యానించారు.
వరి మీద అవగాహన లేని కేటీఆర్, మహమూద్ అలీని కేంద్రమంత్రి దగ్గరకు పంపితే ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. మహమూద్ అలీకి వరి మూసీ నదిల పండుతున్నదో, కాలువల కింద పండుతదో తెలియదని.. కేటీఆర్ కు వరి కింద పండుతుందో, పైన పండుతుందో తెలియదని ఎద్దేవా చేశారు. వర్షాకాలం పంట కొనుగోలు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతుల మీద కక్షతోనే కొనుగోలు జాప్యం చేశారు.. కల్లాల్లో రైతుల చావులు ప్రభుత్వ హత్యలే.. చావులకు కారణం కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిగ్గుతప్పిన బీజేపీ నేతలు రైతులను ఆదుకోకుండా ఫిరాయింపుల మీద ఆలోచనలు చేస్తున్నారని.. మీరసలు మనుషులేనా? మానవత్వం ఉందా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుండు, అరగుండు వెళ్లి కేంద్రాన్ని అడగరు. ఢిల్లీ వెళ్లి వచ్చి బండి సంజయ్ వరి మాటలు పక్కన పెట్టి.. విద్య, వైద్యం మీద సంతకం అని కొత్త రాగం ఎత్తుకుండని అన్నారు.
వరి రైతులకు ఉరి వేస్తా అన్న వెంకట్రామి రెడ్డిని కేసీఆర్ అందలం ఎక్కించిండని ఫైర్ అయ్యారు రేవంత్. రైతులను శాశ్వతంగా ఆదానీ, అంబానీలకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని.. మనం పండించిన పంటను కొనని ప్రభుత్వాన్ని బొంద పెడుదాం అని అన్నారు రేవంత్.. ఈ విషయమై రేపు గవర్నర్ ను కలుస్తామని.. రైతుల సమస్యను పార్లమెంట్ లో లేవనెత్తుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 9 నుంచి 13 లోపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.