ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ దావత్ చేసుకున్నాడు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On CM KCR. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేస్తా అన్న సీఎం కేసీఆర్.. మోదీతో

By Medi Samrat  Published on  27 Nov 2021 4:41 PM IST
ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ దావత్ చేసుకున్నాడు : రేవంత్ రెడ్డి

వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేస్తా అన్న సీఎం కేసీఆర్.. మోదీతో కూడి రైతులను మోసం చేస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వడ్ల కల్లాల‌ వద్ద రైతులు గుండె ఆగి చనిపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భూములు గుంజుకొని ఫామ్ హౌస్ లు కట్టుకున్నాడని.. రైతులు పండించిన పంటకు గిట్టబాటు ధర లేదని ఆరోపించాడు. ప్రతి వస్తువుకు తయారు చేసిన వాడే ధర నిర్ణయిస్తే.. రైతు పంటను మాత్రం దళారీ ధర పెడ్తున్నాడ‌ని.. గ‌తంలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు అండగా వున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు.

గోడౌన్లు, ఎఫ్‌సీఐ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీన‌ని.. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగకుండా నియంత్రించింది కాంగ్రెస్ పార్టీన‌ని తెలిపారు. కేసీఆర్‌ ధర్నా చౌక్‌ లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించార‌ని.. కేసీఆర్‌కు చరిత్ర లేదు.. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర వుందని విమ‌ర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి. కానీ అసమర్థ పాలన వల్ల కల్లాలోనే వడ్లు వున్నాయని అన్నారు. కేసీఆర్‌ వడ్లు కొనక రైతులను ఏడిపిస్తున్నాడని.. సారాలో సోడా కలిపే మంత్రులను వేసుకొని.. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ దావత్ చేసుకున్నాడ‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

గుండు, అర గుండు.. దేనికి పనికి రారని బీజేపీ నేత‌లను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మాట చెప్పాడు.. రైతుల కోసం ఉత్తమ్, వెంకన్న, నేను ఇక్కడ‌నే పడుకుంటాం. కాంగ్రెస్ కార్యకర్తలు కదలి రావాలి.. రైతుల కోసం ఇందిరా పార్క్‌ వద్దకు అని పిలుపునిచ్చారు రేవంత్‌. కేసీఆర్ వడ్లు కొనకుంటే.. పార్లమెంట్ లో మోదీని నిలదీస్తామ‌ని.. కేసీఆర్, మోదీ వేరు వేరు కాదు.. ఇద్దరు తోడు దొంగలేన‌ని రేవంత్ విమ‌ర్శించారు. వరి కొనకుంటే.. అంబేద్కర్ చౌరస్తాలో మోదీ, కేసీఆర్‌లను ఉరి తీయాల్సిందేన‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు రేవంత్‌. మీకు చేత కాకుంటే.. రూ.10వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వు.. చివరి గింజ వరకు కొంటాం.. ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ కూడా ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.


Next Story