ఉత్తరాది రైతులకు ఆర్థిక సాయం చేస్తాననడం విడ్డూరంగా ఉంది
Revanth Reddy Fires On CM KCR. వంద పీనుగులను తిన్న రాబందు తీర్థయాత్ర చేసినట్టు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రకటన ఉందని
By Medi Samrat Published on 20 Nov 2021 4:04 PM GMTవంద పీనుగులను తిన్న రాబందు తీర్థయాత్ర చేసినట్టు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రకటన ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రస్తుతం వానాకాలం పంట కల్లాల్లో కొనుగోలు కోసం పెట్టుకుని రైతులు 20 -30 రోజులుగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోయి, మొలకలు వచ్చిన ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఏమి హామీ ఇస్తారో చెప్పాలని నిలదీశారు. ఆ విషయం వదిలేసి యాసంగి పంటపై ఇప్పుడు పంచాయితీ మొదలు పెట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టు.. తెలంగాణ రైతుల ప్రయోజనాలు పట్టించుకోని కేసీఆర్ ఉత్తరాదిలో ఉద్యమం చేసిన రైతులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అనధికారికంగా 40,000 రైతులు చనిపోయారు.. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారు. వాళ్లు కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యం. కనీసం ఆ కుటుంబాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించలేదు. నిన్నటికి నిన్న కామారెడ్డి జిల్లాలో బీరయ్య అనే రైతు వడ్ల కుప్పపై తొమ్మది రోజులు పడిగాపులు పడి చనిపోతే పోస్టుమార్టం కూడా చేయకుండా, సహజ మరణం అని అధికారులతో రాయించి కేసు మూసేసిన గజదొంగ ఇప్పుడు పెద్ద దానకర్ణుడు లా నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు.
కామారెడ్డి జిల్లాలో ప్రభాకర్ అనే రైతు పాముకాటుతో చనిపోతే సాయం లేదు. నల్ల చట్టాల పై పోరాడిన రైతులపై కేసులు నిమిషంలో ఎత్తేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్ కు.. తెలంగాణ ఉద్యమంలో జీవితాలు ఫణంగా పెట్టి ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలన్న సోయి ఎందుకు లేదని ప్రశ్నించారు. జల వాటాల పంపకంలో మోదీ ముందు మోకరిల్లి కోర్టులో కేసు నాటకంతో ఏడేళ్లు కాలయాపనకు రెండు ప్రభుత్వాలు కారణం కాదా.. అని ప్రశ్నించారు. ఢిల్లీలో నీ పార్టీ ఆఫీసుకు స్థలం సాధించుకోగలిగావు కానీ.. రాష్ట్రంలో నీటి పంచాయితీ మాత్రం తీర్చలేకపోయావని దుయ్యబట్టారు.