ఇల్లు అమ్మి నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తా అన్నరు.. కానీ..

Revanth Reddy Fires On CM KCR. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో అమిస్తాపూర్ లో జంగ్ సైరన్ సభ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  12 Oct 2021 3:35 PM GMT
ఇల్లు అమ్మి నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తా అన్నరు.. కానీ..

కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో అమిస్తాపూర్ లో విద్యార్ధి నిరుద్యోగ‌ జంగ్ సైరన్ సభ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌లో పాల్గొన్న‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు జిల్లాలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, మల్లు ఆనంతరాములు, మల్లికార్జున్ గౌడ్, జైపాల్ రెడ్డి లాంటి మహనీయులు ఉన్నార‌ని.. ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి గువ్వలోడు, గుడ్లగూబలోడు ఎమ్మెల్యే లుగా.. భూ కబ్జాదారులు, ఇసుక దందాలు చేసేటోళ్లు పాలమూరు పరువు తీస్తున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ పార్టీ పెట్టార‌ని.. 2004లో టిఆర్ఎస్ నుంచి అర డజన్ మంత్రులు అయ్యారు. పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి కృష్ణ నీళ్లు దోచుకుపోతుంటే.. కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా టిఆర్ఎస్ నేత ఉన్నార‌ని.. మంత్రి పదవికి ఆశపడి.. రాజశేఖర్ రెడ్డి వద్ద కాళ్ళవద్ద పడిగాపులు కాసిండ్రని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

2008 ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓటర్లు బండకేసి కోట్టిండ్రని.. 2009లో టిడిపి తో పోతుపెట్టుకుంటే 35 సీట్లలో టిఆర్ఎస్ కు డిపాజిట్లు రాకుండా ఓడ‌కొట్టిండ్రని.. 2009లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా.. ఓడిపోతానని భయంతో మహబూబ్ నగర్ లో పోటీ చేస్తే మా ప్రజలు గెలిపించి పార్లమెంట్ కు పంపిండ్రని గుర్తుచేశారు. ఇక్కడ నుంచి గెలిచాక తెలంగాణ పునర్నిర్మాణం పాలమూరు నుంచే మొదలు పెడ్తనన్నారు.. బంజారా హిల్స్ లో తన ఇల్లు అమ్మి ఇక్కడ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తా అన్నరు.. కానీ ఇప్పుడు పాలమూరులో సాగునీటి దోపిడీ జరుగుతుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ పరిశ్రమలు రావడంలేదు.. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు.. మా పిల్లలు ఇంకా వలసలు పోవాల్సిందేనా.. బొంబాయిలో కంపెనీలలో పనిచేయాల్సిందేనా.. అని ప్ర‌శ్న‌ల‌ వ‌ర్షం కురిపించారు.

మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు బడిత పూజ చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు చేశారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు.. కేసీఆర్, తెలంగాణ రాగానే పూర్తి చేసి ఉంటే.. ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్లు అవి అక్రమ ప్రాజెక్టులు అనేవారు కాదని అన్నారు. మిడ్జిల్‌లో మీరు నాటిన మొక్క నేడు మహా వృక్షం అయ్యిందని.. కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షుణ్ని అయినా.. నేను పాలమూరు బిడ్డనే అని గుర్తుచేశారు. 4 వేల కోట్ల రూపాయల ఫీజ్ రియంబ‌ర్స్‌మెంట్‌ ఇవ్వాలన్నా, లాక్షా 91 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.


Next Story