కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద పనేం కాదు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On CM KCR. ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టీ కొట్లాడినట్లు ఉందని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  22 Sep 2021 9:49 AM GMT
కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద పనేం కాదు : రేవంత్ రెడ్డి

ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టీ కొట్లాడినట్లు ఉందని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్ వ‌ద్ద జ‌రుగుతున్న మహాధర్నా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఆఖరి పోరాటమ‌ని.. తెలంగాణ విముక్తి కోసం పోరాటమ‌ని అన్నారు. రాష్ట్రంలో పోడు భూముల కోసం కొట్లాట మొదలయ్యిందని.. మహిళలు అని చూడకుండా డేకాయిట్ కేసులు పెడుతున్నార‌ని.. హరిత హారం ముసుగులో పోడు భూములు గుంజుకుంటున్నారని.. భూములతో పాటు మా ప్రాణాలు కూడా తీసుకోండని గిరిజనులు చెప్తున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురు చేతుల్లో బంధి అయ్యిందని.. తెలంగాణ విముక్తి కావాలంటే గులాబి చీడ వదిలించుకోవాలని అన్నారు.

కేసీఆర్‌కి అండగా ఉన్న మోదీని బండకేసి కొట్టాల‌ని.. గల్లీలో ఉన్న కేడి.. ఢిల్లీలో ఉన్న మోదీ ఇద్దరు ఒకటేన‌ని.. పన్నుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నారని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం, రాష్ట్రం పన్నుల రూపంలో దోచుకుంటున్నారని.. రూ. 24 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్, డీజిల్ రూపంలో వసూలు చేశారని మండిప‌డ్డారు. నల్లధనం బయటకు తెస్తానని మోదీ చెప్పారు.. ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షలు నరేంద్ర మోదీ భాకీ పడ్డారని అన్నారు.

వ్యాక్సిన్ లేక ప్రజలు అల్లాడుతుంటే బర్త్‌డే రోజు గిఫ్ట్ వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్ర‌శ్నించారు. నరేంద్ర మోదీ ఛాయ్‌ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందేన‌ని.. కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్ లు కడితే.. మోదీ రైళ్లు అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. డీ మానిటైజేష‌న్ ఒక విష ప్రయోగమ‌ని.. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా రవాణా సంస్థలు అన్ని తెగ నమ్ముతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ. 6 లక్షల కోట్లకు ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని.. ఒకప్పుడు ఈ సంస్థలను పెట్టి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

మోదీ జాతి సంపదను అధాని, అంబానీ లకు పంచి పెడుతున్నారని.. మేము ఇద్దరం.. మాకు ఇద్దరు అనే రీతి లో దేశాన్ని పట్టి పీడిస్తున్నారని.. తెల్ల దొరల ముసుగులో దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్న చేస్తున్నార‌ని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత మొదటి సారిగా దేశం తిరోగమనంలో పయనిస్తోందని.. అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నామ‌ని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు.. మాకు ఎటువంటి రాజకీయాలు లేవని.. దేశం, రాష్ట్రం గురించే మా పోరాటమ‌ని స్ప‌ష్టం చేశారు.

వేల కోట్ల రూపాయలు కేసీఆర్ బంధువులకు కట్ట బెడుతున్నారని.. రాష్ట్రం, దేశం పెను ప్రమాదం లో పడిందని అన్నారు. ఈ నెల 27న భారత్ బంద్ సక్సెస్ చేయాలని కోరారు. దేశంలోనే తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరగాలని పిలుపునిచ్చారు. 30న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అంబేద్క‌ర్ సాక్షిగా కలెక్టర్లకు వినతులు ఇవ్వాల‌ని.. 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు భాధ్యత తీసుకోవాలని అన్నారు.

అదిలాబాద్ నుంచి ఆశ్వారావు పేట వరకూ పోడు భూముల పోరాటం జ‌రుగుతుంద‌ని.. భద్రాచలంలో బంద్ లో తాను పాల్గొంటాన‌ని.. పోడు భూములకు పట్టాలు ఎలా ఇవ్వరో చూద్దామ‌ని అన్నారు. ఉపసంఘం ల‌ పేరుతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నార‌ని.. ఉపసంఘం వేస్తే ఫారెస్ట్ అధికార్లను ఎలా పంపుతున్నార‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ తీరు శివలింగం మీద తేలులా ఉంద‌ని.. మాకు లింగం నుంచి తేలును ఎలా బయటకు తీయాలో తెలుసని.. కేసీఆర్ ఆటలు ఇక తెలంగాణ గడ్డ మీద సాగవని అన్నారు. అందరం అనుకుంటే కేసీఆర్ ను గద్దె దించడం పెద్ద పనేం కాదని రేవంత్ రెడ్డి అన్నారు.


Next Story