ఆ సభ తర్వాత హుజురాబాద్‌పై దండెత్తుతాం : రేవంత్ రెడ్డి
Revanth Reddy Fires On CM KCR. హుజురాబాద్ ఉపఎన్నిక వచ్చిన్నప్పటి నుంచి కేసీఆర్ కొంగజేపం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు
By Medi Samrat Published on 16 Aug 2021 8:20 PM ISTహుజురాబాద్ ఉపఎన్నిక వచ్చిన్నప్పటి నుంచి కేసీఆర్ కొంగజేపం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమంలో దళితులను ఉపయోగించుకొని ఒక పాచిక లాగా వాడుకున్నారని.. ఏడున్నర ఏండ్లలో కేసీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ జయంతి, వర్ధంతి ఏనాడు నిర్వహించలేదని అన్నారు. నెక్లెస్ రోడ్డులో ప్రపంచమే అబ్బురపడే విదంగా అంబేద్కర్ విగ్రహం పెడుతా అని ఇప్పటికీ తట్ట మట్టి తియ్యలేదని ఫైర్ అయ్యారు. మూడెకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతా అని మాట తప్పారని అన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఒక్క సమీక్ష కూడా ముఖ్యమంత్రి చెయ్యలేదని విమర్శించారు.
ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేష్ నాయక్, లావణ్య లాంటి విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. దళితులకు అన్యాయం చేసిన వాళ్లలో మొదటి దోషి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. దళితబంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని.. అబద్ధాల పునాదుల మీద బీటలు బారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
శాసనసభ సమావేశాలు వెంటనే నిర్వహించాలని.. 30లక్షల మందికి ప్రతి కుటుంబానికి 10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వాలని.. దళితబంధుపై శాసనసభలో ఒకరోజు చర్చ జరపి తీర్మానం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల లోపు ప్రతి దళిత కుటుంబానికి రూ. 10లక్షలు ఇస్తానని అంటే మేము ఎక్కడైనా సంతకాలు పెడుతామని అన్నారు. హుజురాబాద్ లో తుపాన్ రాబోతోందని.. ఆ తుపాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారని అన్నారు.
హుజురాబాద్ దళితసభలో కేసీఆర్ మాటల్లో పిరికితనం కనిపిస్తోందని.. అల్కామీర్ మండిలో ఉన్నట్లు దళితబంధు సభలో టీఆర్ఎస్ నేతలు కనిపించారని రేవంత్ విమర్శించారు. పదవులు గడ్డిపోసతో సమానం అన్న కేసీఆర్ ఎందుకు భయంతో ఉన్నారని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం పట్నం సభ తరువాత హుజురాబాద్ పై దండెత్తుతామని రేవంత్ సవాల్ విసిరారు. రాజకీయంగా కేసీఆర్ కు దళితబంధు సభనే చివరి ఉపన్యాసం రేవంత్ అన్నారు.