కారు నో, పతంగి నో నమ్ముకుంటే మోసపోయేది మీరే

Revanth Reddy Fires On CM KCR. కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో శ‌నివారం ఇందిరాపార్క్ వ‌ద్ద మైనారిటీ గర్జన సభ జరిగింది.

By Medi Samrat  Published on  14 Aug 2021 12:26 PM GMT
కారు నో, పతంగి నో నమ్ముకుంటే మోసపోయేది మీరే

కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో శ‌నివారం ఇందిరాపార్క్ వ‌ద్ద మైనారిటీ గర్జన సభ జరిగింది. ఈ స‌భ‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు లేవు, ఓట్లకోసం కాంగ్రెస్ మైనార్టీ గర్జన స‌భ పెట్ట‌లేద‌ని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తేవడానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని.. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని.. నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెసేన‌ని.. మైనార్టీలు ఒకసారి ఆలోచించాలని అన్నారు.

వైస్సార్ నేతృత్వంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎంతోమంది మైనార్టీలకు అవకాశాలు లభించాయని తెలిపారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేన‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీదే.. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదే.. కారు నో, పతంగి నో నమ్ముకుంటే మోసపోయేది మీరే న‌ని అన్నారు. త్రిబుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ మాత్రమేన‌ని.. కాంగ్రెస్ దగ్గర 200 మంది ఎంపీలుంటే అలాంటి చట్టాలు తెచ్చే దైర్యం చేసేవారా..? అని ప్ర‌శ్నించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాత్రమేన‌ని అన్నారు.

మైనార్టీలకు ఎవరివల్ల నష్టం జరుగుతుందో చెప్పాలనే మైనార్టీ గర్జన చేపట్టామ‌ని.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కు వేసే ఓటు బీజేపీకి వెళ్తుందని.. దళితుల కంటే కూడా ముస్లీంలు వెనుకబడ్డారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని.. ఇంతవరకు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదని అన్నారు. మైనార్టీలకు శత్రువైన కేసీఆర్‌ ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడని ఆరోపించారు. మోదీకి మద్దతుగా నిలిచే కేసీఆర్‌ పార్టీని ఓడించాలని.. కేసీఆర్ కారును జుమ్మెరాత్ బజార్ కు పంపాలని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయని.. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. అందులో 12 శాతం రిజర్వేషన్ ఇస్తే 20, 30 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రతి ముస్లీం కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని.. దళిత బంధు లెక్క మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యూడిషరీ పవర్స్ కల్పిస్తామని హామీ ఇస్తున్నామ‌న్నారు రేవంత్‌.


Next Story
Share it