ఇంద్రవెల్లిలో సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On CM KCR. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం దళిత, గిరిజన దండోరా బహిరంగ సభ జ‌రిగింది.

By Medi Samrat  Published on  9 Aug 2021 1:43 PM GMT
ఇంద్రవెల్లిలో సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం దళిత, గిరిజన దండోరా బహిరంగ సభ జ‌రిగింది. స‌భ‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలనలో ద‌ళిత‌, గిరిజ‌నుల‌ జీవితాలు చితికిపోతున్నాయని అన్నారు. వారి జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళిక అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకొస్తారని.. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని ఒప్పుకున్నారని అన్నారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్‌ అన్నారు. ఎస్సీని ఉపముఖ్యమంత్రిని చేసి రెండు నెల‌ల‌కే తొలగించారని.. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదని రేవంత్ ఫైర్ అయ్యారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కు అన్యాయం జరిగిందని.. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అని తెలిపారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమురం భీమ్‌ గడ్డ ఇదేనన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబం కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా రూ. వేల కోట్లను దోచుకుంటోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌.. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.


Next Story