కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో 450 మంది రైతులు అమరులయ్యారని.. రైతులను నాశనం చేసినవాళ్ళు.. రాజకీయంగా ఎదిగినట్టు చరిత్రలో లేదని టీపీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి రోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను కేంద్రమంత్రి కొడుకు అధికార గర్వంతో నలుగురు రైతులను తొక్కి చంపారని ఫైర్ అయ్యారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని అన్నారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
చనిపోయిన రైతుల కుటుంబాల పక్షాన దేశమంతా నిలబడాల్సిన అవసరం ఉందని.. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ సర్కార్ కర్కశంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రా కొడుకుతో పాటు బీజేపీ నాయకులపై హత్య కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మోదీ, అమిత్ షా మరణ శాసనం చేస్తే.. అజయ్ మిశ్రా, ఆయన కొడుకు అమలు చేశారని అన్నారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని.. సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి చేత ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.