మునుగోడులో ఆ రెండు పార్టీలు కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నాయి

Revanth Reddy Fire On TRS, BJP. మునుగోడులో టీఆర్ఎస్ – బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నయ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు

By Medi Samrat  Published on  19 Oct 2022 8:01 PM IST
మునుగోడులో ఆ రెండు పార్టీలు కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నాయి

మునుగోడులో టీఆర్ఎస్ – బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నయ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతోందని అన్నారు. బీజేపీ కోసం సీఆర్పీఎఫ్ – టీఆర్ఎస్ కోసం రాష్ట్ర పోలీసులు పని చేయబోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలు ఉద్రిక్తతలు సృష్టించి.. రెండు పార్టీల ఎన్నికల పోలరైజేషన్ కోసం పని చేయబోతున్నాయని ఆరోపించాయి.

ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రెండు పార్టీల మధ్య పోలరైజేషన్ కు కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో చీకట్లో మోడీ, షా ఉపదేశం తీసుకుని వస్తున్నార‌ని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించి.. సెంటిమెంట్ రాజేయబోతున్నార‌ని వ్యాఖ్యానించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా రఘునందన్, ఈటెలను ఉరేయబోతున్నట్టు హడావుడి చేశారని అన్నారు. ఆ ఇద్దరు గెలిచాక వాళ్లపై కేసులు కాకులెత్తుకెళ్లాయని ఎద్దేవా చేశారు.

మునుగోడులో సైతం ఆ ఇద్దరి మధ్యనే పోలరైజేషన్ కోసం.. ఇద్దరు కలిసే ఉద్రిక్తతలు సృష్టించి కుట్ర చేయబోతున్నారని.. కార్యకర్తలు, మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి.. ఈ కుట్రను తిప్పి కొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Next Story