పెట్రోల్- డీజిల్ ధరల పెంపుపై ఒకరి తప్పును ఇంకొకరు కప్పిపుచ్చుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పేదలను దోచుకోవడమే పనిగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచి 12వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం భారం మోపుతోందని ఫైర్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం రావడానికి కారణం టీఆరెస్ ప్రభుత్వమేనని.. ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడం వల్లే.. విద్యుత్ సంస్థలకు బకాయిలు ఏర్పడ్డాయని విమర్శించారు.
కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దమనుషులు విద్యుత్ బిల్లు ఎగవేత వల్ల 6 వేల కోట్ల నష్టం ఏర్పడిందని ఆరోపించారు. ఒక చేత్తో ఉచితం ఇస్తున్నాం అంటూనే- మరో చేత్తో విద్యుత్ భారం మోపుతోందని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు డీజిల్- పెట్రోల్ ధరలు నాలుగున్నర నెలలు పెరగలేదని.. ఎన్నికల ఫలితాలు రాగానే మళ్ళీ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల కోసం మాత్రమే పెట్రోల్- డీజిల్- గ్యాస్ ధరలు పెరగకుండా ఐదు నెలలపాటు ఆపారని దుయ్యబట్టారు.
బీజేపీ కోణంలో GDP అంటే గ్యాస్-డీజిల్-పెట్రోల్ ధరలు పెంచడమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి.. మళ్ళీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం- గ్యాస్ ధరలు పెంచడం సమన్వయం తోనే జరిగాయని ఆరోపించారు. 31వ తేదీన మహిళా కాంగ్రేస్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై ఆందోళన ఉంటుందని తెలిపారు. 30వ తేదీన మండల- నియోజకవర్గ కేంద్రాల్లోని AE-DE ఆఫీస్ ల ముందు నిరసన కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాలలో ర్యాలీలు- కేసీఆర్- మోడీ దిష్టిబొమ్మల దగ్నం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 5వ తేదీన కలెక్టర్ కార్యాలయల ముందు నిరసన- ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. 7వ తేదీన విద్యుత్ సౌధ- పౌర సరఫరా ఆఫీస్ ల ముట్టడి కార్యక్రమం ఉంటుందని అన్నారు. ముట్టడి కార్యక్రమంలో మేమందరం పాల్గొంటామని.. 31వ తేదీన పార్టీలకు అతీతంగా మహిళలందరూ పాల్గొనాలని కోరారు.