అధికారంలోకి వచ్చాక ఆ ఎమ్మెల్యేలు పొందిన లబ్ది పైన విచారణ జరిపి అన్ని స్వాధీనం చేసుకుంటాం
Revanth Reddy Fire On Pinapaka MLA. రేపటి నుంచి పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్
By Medi Samrat Published on 12 Feb 2023 2:45 PM GMTరేపటి నుంచి పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ ఎమ్మెల్యే కమిషన్లకు, కాంట్రాక్టలకు అలవాటు పడి అధికార పార్టీకి అమ్ముడుపోయాడని విమర్శించారు. ఇక్కడ దాతలు ఇచ్చిన భూమిలో కార్యకర్తలు పైసా పైసా కూడకట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటే.. ఎమ్మెల్యే దాన్ని కబ్జా చేసాడని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీకి అప్పగించి విజ్ఞత చాటుకోవాలని.. లేకపోతే వచ్చే కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాలని అన్నారు. మళ్ళీ ఏ చట్ట సభ మెట్లు ఎక్కకుండా చెయ్యాలని కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మొన్న మొయినాబాద్ లో 4 ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నమోదు అయింది.. ఆ కేసుకు సంబంధించిన వివరాలు పంపాలని సిబిఐ చీఫ్ సెక్రటరీని అడిగింది.. ఆ కేసుతో పాటు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల వివరాలు కూడా జత చేసి పంపాలని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసామని తెలిపారు.
డీజీపీకి, సిఎస్ కు లేఖలు రాసి ఫిర్యాదు కాపీలు అందించామని.. అందువల్ల కేసులో 12 మందిని కూడా జత చెయ్యాలని అన్నారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారే.. అందులో పినపాక.ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరంతా ప్రలోభాలకు ఆశపడి ఫిరాయింపులు అలవాటు చేసుకున్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారి పేరు జత చెయ్యకపోతే హైకోర్ట్ ను ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఎమ్మెల్యేలు పొందిన లబ్ది పైన విచారణ జరిపి అన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నేరుగా లబ్ది జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు.
ఒకరు మంత్రి, ఒకరు కార్పోరేషన్ చైర్మన్, ఇంకొకరు విప్, కాంట్రాక్తులు, రాజకీయ పదవులు, ఆర్థిక లబ్ది జరిగింది. ఇవన్నీ వివరాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోమ్ మంత్రి లకు లేఖలు రాస్తామన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు టీఆర్ఎస్, సీఎం కుంటుంబం అవినీతి మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి లు అధికారికంగా లేఖలు రాయాలని.. లేకపోతే ఈ రాజకీయ కుంభకోణంలో బీజేపీ కి కూడా పాత్ర ఉందని తేటతెల్లం అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.