ఆ దుఃఖం చూసి నాకూ ఏడుపు వచ్చింది : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On Minister Dayakar Rao. పీజీ చదివిన వికలాంగ నిరుద్యోగ యువకుడు నాగరాజు దుఃఖం చూసి నాకూ దుఃఖం వచ్చిందని

By Medi Samrat  Published on  15 Feb 2023 9:15 PM IST
ఆ దుఃఖం చూసి నాకూ ఏడుపు వచ్చింది : రేవంత్ రెడ్డి

పీజీ చదివిన వికలాంగ నిరుద్యోగ యువకుడు నాగరాజు దుఃఖం చూసి నాకూ దుఃఖం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. ఏ నియామకాల కోసం కొట్లాడామో.. తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో.. అదే తెలంగాణలో నియామకాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న అన్నారు. జేఏసీ పెట్టి.. జెండాలు కట్టి.. రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చింది మేము.. ఇప్పుడు తెలంగాణ ఎవరిపాలైందో.. ఎవరు ఏలుతున్నారో ఒకసారి ఆలోచన చేయండ‌ని అన్నారు.

భాగవతం రచించిన బమ్మెర పోతన పుట్టిన గడ్డ ఇది. దొరలు, గడీలపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఆడబిడ్డ చాకలి ఐలమ్మ గడ్డ ఇది. ఈ పోరాటాల పురిటిగడ్డలో పలక బలపం ఇచ్చినా ఏబీసీడీలు రాయలేనివాడు ఎమ్మెల్యే అయ్యాడని.. పలక బలపం ఇస్తే ఈ ఎమ్మెల్యే ఏబీసీడీలు మొత్తం రాయగలడా అని రాజీవ్ చౌరస్తా సాక్షిగా సవాల్ విసురుతున్నాన‌న్నారు. సుధాకర్ రావును మోసం చేసి రాజకీయంగా ఖతం చేసిన చరిత్ర ఈ ఊసరవెల్లి దయాకర్ ది విమ‌ర్శించారు.

2014లో కేసీఆర్ సీఎం అయ్యేందుకు ఈ ఊసరవెల్లి దయాకర్ సహకరించిండు. టీడీపీలో ఉండి కోవర్టు ఆపరేషన్ చేసి టీఆర్ఎస్ కు సహకరించి ఈ గడ్డపై టీడీపీ జెండాను పీకేసేలా చేశాడని విమ‌ర్శించారు. ధరణి పేరుతో దందాలు చేసి అమ్ముకున్న భూములపై కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో విచారణ చేపడతాం.. బినామీ లపై కూడా విజిలెన్స్ తో విచారణ చేయిస్తామ‌ని అన్నారు.

దయాకర్ ను నమ్మినబంటు అని కేసీఆర్ అనుకుంటుండు.. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కోవర్టు ఆపరేషన్ తో ఖతం చేసిండు.. నువ్ మంత్రి పదవి ఇచ్చినా నీకు ద్రోహం చేయక మానడు.. దయాకర్ రావు అంటేనే నమ్మకద్రోహం.. నమ్మకద్రోహం అంటేనే దయాకర్ రావు అని విమ‌ర్శించారు. పాలకుర్తి చౌరస్తాలో రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామ‌ని.. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క ఏడాదిలోనే భర్తీ చేస్తామ‌ని అన్నారు. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ రూ.5లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందిస్తామ‌న్నారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి.. ఈ హామీలు అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటామ‌న్నారు. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని రేవంత్ రెడ్డి ప్ర‌జానీకాన్ని అడిగారు.


Next Story