కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగిన రేవంత్

Revanth Reddy Fire On Komatireddy Rajagopal Reddy. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై పీసీసీ అధ్య‌క్షుడు

By Medi Samrat  Published on  2 Aug 2022 4:08 PM GMT
కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగిన రేవంత్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమ ఆర్థిక లావాదేవీలు కోసం, మోదీ, అమిత్ షా విసిరిన ఎంగిలి మెతుకుల కోసం, కాంట్రాక్టుల‌ కోసం పార్టీ విడార‌ని మండిప‌డ్డారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగే పరిణామాలు యావత్ తెలంగాణా గమనిస్తుందని అన్నారు. ఏనుగులు తినే వాళ్ళు ఉంటే.. ఇప్పుడు పినిగెలు తినే వాళ్ళు బయలుదేరారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ మోదీని క్షమించర‌ని.. యావత్ తెలంగాణ ప్రధాని మోదీని బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.

ఆర్ధిక లావాదేవీలు కోసం కన్న తల్లి లాంటి పార్టీ ని వదిలేస్తున్నారని కోమ‌టిరెడ్డిని విమ‌ర్శించారు. ఈడీ డిపార్ట్మెంట్ బీజేపీ తొత్తుగా మారిందని ఆరోపించారు. 4 కోట్ల తెలంగాణా ప్రజలకు కనిపించే తల్లి సోనియా గాంధీ అని.. సోనియా గాంధీపై ఈడీ అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంటే.. తల నరకాల్సిన సమయంలో.. తీపి కబుర్లు చెప్పి.. తేనే పూసిన కత్తిలా అమిత్ షా దగ్గర కూర్చుని కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కుక్కలకు విసిరినట్లు బిస్కెట్ విసిరితే.. కాంగ్రెస్ పార్టీతో ఉన్న ప్రేగు బంధం తెంచుకున్నార‌ని తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు. మునుగోడు ప్ర‌జ‌లు గెలిపించింది సోనియా గాంధీ ప్రతినిధిని.. కోమటిరెడ్డి చేసిన పనికి మునుగోడు కాంగ్రెస్ శ్రేణుల మద్దతు ఉండదని అన్నారు. తెలంగాణలో పార్టీ పిరాయింపులను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నదని తెలిపారు. ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోని కాంగ్రెస్ అధిష్టానం ముందుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మిమల్ని పట్టించుకోక‌పోతే బ్రాంది షాప్ లో పనిచేయడనికి కూడా పనికిరారని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీతో పాటు అందరం ఈ నెల‌ 5న మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం అని అన్నారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్య‌క్తం చేశారు.




Next Story