అలాంటి వాళ్లు కాంగ్రెస్ నుండి వెళ్లిపోండి

Revanth Reddy Fire On Kaushik Reddy. సోమ‌వారం ఉద‌యం కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాల్ రికార్డింగ్ లీక్ అయిన

By Medi Samrat  Published on  12 July 2021 9:24 PM IST
అలాంటి వాళ్లు కాంగ్రెస్ నుండి వెళ్లిపోండి

సోమ‌వారం ఉద‌యం కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాల్ రికార్డింగ్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌రిణామాలు చ‌క‌చ‌కా జ‌రిగాయి. కౌశిక్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ క్ర‌మశిక్ష‌ణ క‌మిటీ షోకాజు నోటీసులు జారీ చేయ‌డం.. ఆ వెంట‌నే కౌశిక్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేయ‌డం.. వెనువెంట‌నే కౌశిక్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు నేత‌లు ప్ర‌క‌టించ‌డం ట‌క‌ట‌కా జ‌రిగిపోయాయి.

అయితే.. రాజీనామా చేస్తూ కౌశిక్ రెడ్డి నూత‌న పీసీసీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌పై నిప్పులు చెరిగాడు. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు తనకు సహకరించ లేదని.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారని కౌశిక్‌ రెడ్డి ఆరోపించాడు. రూ.50 కోట్ల రూపాయలు ఇచ్చి.. రేవంత్‌ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యారని.. సీనియర్లను కాదని రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం తనను బాధించిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కష్టం అని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు కౌశిక్‌ రెడ్డి అన్నారు.

అయితే.. కౌశిక్‌ రెడ్డి రాజీనామాపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కౌశిక్‌ రెడ్డి కోవర్ట్‌గా మారారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను విడిచిపెట్టేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలబోనని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.


Next Story