సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On CM KCR. డిసెంబర్ 9 కి తెలంగాణలో ఎంతో ప్రాధాన్యం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  9 Dec 2022 1:30 PM GMT
సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది : రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9 కి తెలంగాణలో ఎంతో ప్రాధాన్యం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు బీమా కాంగ్రెస్ కల్పిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 609 మంది కార్యకర్తలు మరణించారు. ఈ రోజు 100 మందికి చెక్కులను పంపిణీ చేశామ‌ని తెలిపారు. ఈ మధ్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. మోదీ ఓటమి గురించి మీడియాలో రాకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఓటమి పాలైంది. 15 ఏళ్ల బీజేపీ పాలనను ఢిల్లీ ఓటర్లు తిరస్కరించారు. ఢిల్లీ ప్రజలు మోదీ నాయకత్వాన్ని తిరస్కరించారు. హిమాచల్ లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. బీజేపీ అనుకూల మీడియా ఈ వార్తను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఇప్పటి వరకు ఉన్న అధికారాన్ని మాత్రమే బీజేపీ నిలబెట్టుకుంది. మూడు రాష్ట్రాల్లో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. ఇది బీజేపీ కి ఘోరమైన ఓటమి. ధరలు పెంచిన మోదీని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి కేసీఆర్ కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది. తెలంగాణతో ఆయనకు పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయింది. అది ఆయన ఇష్టం.. ఆయన ఖర్మ అని వ్యాఖ్యానించారు. జగన్ ఆత్మ సజ్జల తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తామన్నారు. ఈ వార్తపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరూ స్పందించలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ రాష్ట్రం అని రాసుకున్నారు. ఇది యధాలాపంగా జరిగింది కాదు. సజ్జల మాట్లాడి 24 గంటలు గడవకముందే ఎన్నికల సంఘం లేఖలో అడ్రస్ ఏపీ గా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా కేసీఆర్ అంగీకరించడం లేదని ఆరోపించారు. సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది. ఇది పక్కా ప్రణాళికతో జరిగింది. ఇది ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహం. ఇది నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అని అభివ‌ర్ణించారు. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.


Next Story