60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదు

Revanth Reddy Fire On CM KCR. తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ నివాళులు అర్పించారు

By Medi Samrat  Published on  3 Dec 2022 3:42 PM IST
60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదు

తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ నివాళులు అర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న ఆయ‌న శ్రీకాంత్ చారి చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తరువాత ఓయూలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను కోల్పోలేదని.. తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఓయూ.. అని అన్నారు. తెలంగాణ సమాజంపై ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేసినప్పుడల్లా కొట్లాడిన గడ్డ ఓయూ అని.. శ్రీకాంత్ చారి వర్దంతి సందర్బంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేయడం సంతోషమ‌న్నారు.

ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఆ ముసుగులో దోచుకుంటున్నారో అందరికీ తెలుసన‌ని విమ‌ర్శించారు. సోనియా తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారంటే అది ఈ బిడ్డల త్యాగాల ఫలితమేన‌న్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి టీఆర్ఎస్ గద్దెనెక్కిందని.. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగం, 3ఎకరాల భూమి ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు.. కానీ 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదని విమ‌ర్శించారు.

కొందరి అడ్రస్ తెలియదని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా.. ఆనాటి శ్రీకాంత్ చారి నుంచి ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో అని పేర్కొన్నారు. గతంలో ఓయూకు రాకుండా నన్ను అడ్డుక్కోవాలని చూసినా.. వచ్చి విద్యార్థులకు అండగా ఉన్నాన‌ని తెలిపారు. మీ కడుపు నిండితే, మీ ఇల్లు పండితే చాలా? అని ప్ర‌శ్నించారు. నిరుద్యోగంలో దేశంలో తెలంగాణ ఉందని ఒక సంస్థ నివేదిక ఇచ్చింది. ఎందుకిలా జరుగుతుందో ప్రభుత్వం ఒక్కసారైనా సమీక్ష చేసిందా? అని నిల‌దీశారు.

గిరిజన ప్రాంతాల్లో ఉన్న సింగిల్ టీచర్ స్కూళ్లను ప్రభుత్వం మూసివేయించింది. ఇది దళితులు, గిరిజనులను చదువుకు దూరం చేయడం కాదా? అని అడిగారు. నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో యూనివర్సిటీలు వెలవెలబోతున్నాయి. యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం వెనక ప్రభుత్వ కుట్రను గమనించండి. వీటన్నింటిపై విశ్లేషణ చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పారు.

తీవ్రమైన సమస్య వచ్చినపుడు రాజకీయ నాయకులమంతా ఓయూ వైపు చూస్తాం.. ఇన్నాళ్లుగా ఓయూ ఎందుకు కార్యక్రమాలు నిర్వహించడం లేదని అనుకున్నా.. కానీ ఈ కార్యక్రమంతో తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాల్సిన సందర్భం ఇదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం నడుస్తోంది. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదని అన్నారు.

ఓయూలోకి పోలీసులు రావాలంటే గతంలో భయపడేవారు. కానీ ఇపుడు పోలీసులు ఓయూలోకి వచ్చి అణచివేస్తున్నారంటే ఈ పాలన ఎలాంటిదో అర్థం చేసుకోండి. రాచరికపు మనస్తత్వంతోనే ఈ అణచివేత. తెలంగాణ వస్తే రక్తం చిందదన్నారు.. కానీ ఎన్ కౌంటర్లు జరిగాయి. కేసీఆర్ నక్సలైట్ల ఎజెండా ఎక్కడపోయిందని ప్ర‌శ్నించారు. కుటుంబానికి పదవులు ఇవ్వాలని ఏ ఎజెండాలో రాసి ఉంది?.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం తెలంగాణ రాష్ట్రం తెచుకున్నాం. నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేశారు. అభివృద్ధి నమూనా అయితే నిజాంకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం జరిగింది. ఆధిపత్యం, అణచివేతల వల్లే పోరాటాలు ఉద్భవించాయి. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని విమ‌ర్శించారు.

సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదు. మళ్లీ అలజడి రేగితే అందులో కేసీఆర్ కాలి బూడిద అవుతావు.. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయకు కేసీఆర్.. బూట్లు చేతపట్టుకుని పరుగెత్తేలా చేస్తారు జాగ్రత్త అంటూ తీవ్రవ్యాఖ్య‌లు చేశారు.


Next Story