యుద్ధప్రాతిపదికన మార్గదర్శకాలను విడుదల చేయండి.. లేని పక్షంలో ..
Revanth Reddy Fire On CM KCR. అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య, పోడు భూముల వివాదం విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
By Medi Samrat Published on 23 Nov 2022 10:15 AM GMTఅటవీ అధికారి శ్రీనివాసరావు హత్య, పోడు భూముల వివాదం విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోంది. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో మీ ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతోందన్నారు. ఈ క్రమంలోనే నిన్న కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని పోకలగూడెంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో హత్యకు గురికావడం చాలా దారుణం. మీ ప్రభుత్వ చేతగానితనంతో నిజాయితీ పరుడైన ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం చాలా బాధాకరం. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని లేఖలో ఆరోపించారు. ఈ హత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలని లేఖలో డిమాండ్ చేశారు.
గత ఎనిమిదేళ్లుగా మీరు పోడు భూములపై హక్కులు కల్పిస్తామని అటు లబ్దిదారులను ఊరిస్తూ, మరోవైపు అటవీ భూములను సేద్యం చేస్తున్నారని గిరిజనులపైకి అధికారులను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారు. మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అటవీ అధికారులు, గిరిజనుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు, మూడేండ్లుగా పోడు భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు రావడం, గిరిజనులు అడ్డుకోవడం, ఈ క్రమంలో గొడవలు జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది గిరిజనులపై కేసులు పెట్టారు. అంతేకాకుండా కొంత మంది ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై దాడులకు దిగారు.
గతంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్, సిబ్బందిపై దాడి చేశారు. గతేడాది జూలై 2న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారులో ఫారెస్ట్ సెక్షన్ అధికారి మధుసూదన్ గౌడ్ బృందం, భూపాలపల్లి రేంజి అధికారి కూడా దాడులకు గురయ్యారు. 2018లో గిరిజనుల ఓట్ల కోసం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. మెనిఫెస్టోలో కూడా చేర్చారు. ఎన్నికలు అయిపోగానే అన్ని హామీల మాదిరిగానే ఈ అంశాన్ని కూడా అటకెక్కించారని విమర్శించారు.
తక్షణమే పోడు భూములకు పట్టాలిచ్చే కార్యాచరణను ప్రకటించాలని లేఖలో కోరారు. అప్పటివరకూ పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీల జోలికి వెళ్లకుండా అధికారులకు అదేశాలివ్వాలి. విధులు నిర్వహిస్తున్న అధికారులకు భద్రత కల్పించాలి. అటవీ అధికారుల డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. పోడు భూముల పేరుతో గిరిజనులు, అధికారుల మధ్య చిచ్చు పెట్టడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాం అని తెలిపారు.