రైతుల నుంచి ధాన్యం కొనాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొన్న ధాన్యాన్ని ఎవరి అమ్ముకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని.. ఐకేపీ కేంద్రాలు కేంద్రం వచ్చి పెడుతుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు ప్రతిగింజా కొంటాం అన్నారు కదా? అని నిలదీశారు. కేంద్రాన్ని ఒప్పించే భాద్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని రేవంత్ అన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానంటే ఏర్పాట్లు మేము చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు ప్రధానిని ఈ అంశంపై కలవడం లేదని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్ల అంశంపై కొలిక్కి తేవడానికి కేసీఆర్ ఎందుకు ప్రయత్నం చేయడం లేదని నిలదీశారు. మంత్రుల బృందంలో కేటీఆర్- హరీష్ రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. 10 వేల కోట్ల రూపాయలు మాకు ఇస్తే.. ధాన్యం కొనుగోలు చేసే భాద్యత మేము తీసుకుంటామని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో లేని సమస్యను బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. మా శ్రేణులతో రక్షణగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు.