నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దేశ రైతాంగానికి అభినందనలు తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన నేఫథ్యంలో శుక్రవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయం అని వ్యాఖ్యానించారు. దేశానికి వెన్నెముకైన రైతు కన్నెర్ర చేస్తే ఎంతటి నియంతైనా దిగిరాకతప్పదని అనడానికి ఇది నిదర్శనమని.. రైతాంగ పోరాట చరిత్రలో ఇదొక చారిత్రక విజయంగా అభివర్ణించారు.
ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతుల సంకల్పం ముందు అవి తునాతునకలయ్యాయని.. కేంద్రం ముందే కళ్లు తెరిచి ఉంటే ఉద్యమంలో వందల మంది రైతుల ప్రాణాలు పోయేవి కాదని అన్నారు. దేశంలో ఇతర ప్రజా సమస్యల పై పోరాటానికి రైతు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ధాన్యం కొనుగోళ్ల పై కేసీఆర్ కూడా దిగిరాక తప్పదని.. కల్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమంతో కేసీఆర్ అహంకారాన్ని అణుచుతామని.. ప్రతి గింజ కొనే వరకు వదలమని రేవంత్ రెడ్డి అన్నారు.