టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో ఆదివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. అనంతరం సికింద్రాబాద్ చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డికి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాల జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులను ప్రేమ్ సాగర్ రావు.. రేవంత్ రెడ్డికి పరిచయం చేశారు.
అనంతరం మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రేమ్ సాగర్‌రావుకు, తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వెల్లడించారు. ప్రేమ్ సాగర్ రావు తనకు సోదర సమానులు అని ఆయన అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కదం తొక్కుతామని ఆయన ప్రకటించారు. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా దినోత్సవం నాడు.. ఇంద్రవల్లిలో లక్ష మందితో దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
అనంతరం ప్రేమ్ సాగర్ రావు.. మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చితీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.