ఎస్సీ వర్గీకరణ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 9 Oct 2024 2:05 PM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వర్గీకరణకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ చివరకు ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్‌ను తక్షణమే నియమించాలని, 60 రోజుల్లోగా నివేదిక అందజేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కమిషన్ నివేదిక సమర్పణ తర్వాత రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక కులాల సర్వే అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫిర్యాదులపై చర్చించి పంజాబ్, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాల్లో వర్గీకరణ ఏవిధంగా అమలుచేస్తున్నారో సమీక్షించారు.