కోకాపేట్‌ భూములపై సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన‌ రేవంత్

Revanth Complains To CBI Director Sale of Land In Kokapet. సీబీఐ డైరెక్టర్ తో టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గురువారంనాడు సమావేశమ‌య్యారు

By Medi Samrat  Published on  9 Sep 2021 9:06 AM GMT
కోకాపేట్‌ భూములపై సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన‌ రేవంత్

సీబీఐ డైరెక్టర్ తో టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గురువారంనాడు సమావేశమ‌య్యారు. కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కోకాపేట భూముల్లో జరిగిన అవినీతి పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ను కలిసి విచారణ జరిపించాలని కోరుతామని అన్నారు. కోకాపేట భూములను కేసీఆర్ బంధువులకు, కావాల్సిన వారికి తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ. 2500 కోట్లకు భూములను అమ్మాం అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.1500 కోట్లు నష్టం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ డైరెక్టర్ ని కలవడం జరిగిందని.. రాత పూర్వకమైన నివేదిక ఇవ్వడం జరిగిందని వెల్ల‌డించారు.

కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతికి పాల్పడి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టి అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ కి కావాల్సిన గుప్పెడు మంది కొరకు తెలంగాణ సందపను దోచిపెడుతున్నార‌ని వ్యాఖ్య‌లు చేశారు. కోకాపేట, ఖానామెట్‌ భూముల టెండర్ల‌లో గోల్‌మాల్‌ జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, సిద్ధిపేట కలెక్టర్ వెంకటారామిరెడ్డిపై సీబీఐ డైరెక్టర్ కి రాతపూర్వకమైన ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. మై హోమ్ సంస్థ, రాజ్ పుష్ప సంస్థ, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్ష లబ్ధిదారులని.. వారిపై కూడా ఫిర్యాదు చేశామ‌ని పేర్కొన్నారు.

బండి సంజయ్, కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డిలు పదే పదే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని.. తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని.. జైల్ కి పంపిస్తామని ప్రకటనలు చేస్తున్నారు కానీ.. కేసీఆర్ అవినీతిపై విచారణకు అదేశించమని ప్రధాని, హోంమంత్రి, ఈడీ, సీబీఐ డైరెక్టర్లకు కానీ ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని నిల‌దీశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. మోదీ, అమిత్ షా నీతి, నిజాయితీ పరిపాలన అందించాలంటే.. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలను ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కేసీఆర్ తో కుమ్మక్కవ‌కపోతే.. మేము చేసిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అడ‌గాల‌ని స‌వాల్ విసిరారు.


Next Story
Share it