ఆ కేసులో తెలంగాణ సర్కార్‌కు ఊరట..సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik
ఆ కేసులో తెలంగాణ సర్కార్‌కు ఊరట..సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో స్థానికత రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ మేరకు గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి కోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగా స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. తెలంగాణలో లోకల్ రిజర్వేషన్లు పొందాలంటే.. కనీసం 9వ తరగతి నుంచి 12 వరకు చదవాల్సిందేనని సర్కార్ పెట్టిన నిబంధనను సమర్ధిస్తూ.. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్ 33ని సుప్రీంకోర్టు సమర్ధించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలను తయారు చేసుకున్న అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించగా, ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థులు పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థుల అలాగే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి ధర్మాసనం తీర్పు వెలువరించింది.