కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది: మాజీ మంత్రి హరీష్‌ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

By Knakam Karthik
Published on : 31 Jan 2025 12:19 PM IST

Telangana, Congress, Brs, Cm Revanth, Ex Minister Harish Rao, Real Estate

కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది: మాజీ మంత్రి హరీష్‌ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని మేడ్చల్ జిల్లాలో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమని ఎక్స్ వేదికగా విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని ఆరోపించారు. శాంతి భద్రతలు దిగజారడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని విమర్శించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అంటే బిల్డర్లకు స్వర్గధామమని.. ఇదంతా ఒకప్పుడని..ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు.

'నేను రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి వచ్చాను, రియల్‌ ఎస్టేట్‌ గురించి నాకు చెప్తారా?’ అని మీడియా సమావేశంలో దబాయించిన సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నాడని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారని.. ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story