కేసీఆర్ ఆరోగ్యంపై రామోజీరావు లేఖ

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైందని

By Medi Samrat  Published on  9 Dec 2023 12:44 PM GMT
కేసీఆర్ ఆరోగ్యంపై రామోజీరావు లేఖ

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ విజయవంతమైందని, ఆయన కోలుకుంటున్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారని.. మరో రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ కు ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని, త్వ‌రిత‌గ‌తిన కోలుకోవ‌డానికి అనుకూలంగా కేసీఆర్ శ‌రీరం సహకరిస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆకాంక్షించారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. కేసీఆర్ త్వరగా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు. "శ్రీ తారక రామారావు గారికి,

నమస్కారం. నాన్నగారు ప్రమాదవశాత్తూ జారిపడి క్షతగాత్రులయ్యారని తెలిసి నాకు కలిగిన బాధను మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. తుంటి మార్పిడి కోసం ఆయనకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందన్న వార్త ముదావహం. తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని సాఫల్యం పొందిన ఆయన ఈ సవాలును అవలీలగా అధిగమిస్తారనీ, కొన్ని వారాల విశ్రాంతి అనివార్యమైనా అనతికాలంలోనే కోలుకొని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను" అంటూ రామోజీరావు లేఖ రాశారు.

Next Story