తెలంగాణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగా మహాలక్ష్మి, చేయూత పథకాలను ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమయింది. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు, బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక ఆరోగ్యశ్రీ పథకం పరిధిని కూడా ప్రభుత్వం రూ. 10 లక్షలకు పెంచింది.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి జీరో చార్జ్ టికెట్లను సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. రాష్ట్రంలోని పలు బస్ స్టేషన్స్ లో ఉచిత ఆర్టీసీ సేవలు వినియోగించుకోవడానికి మహిళలు భారీ ఎత్తున క్యూలు కట్టారు. మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్న పథకం తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని.. కానీ కుటుంబం ప్రయాణించేలా బస్సు చార్జీలో రాయితీ ఇస్తే ఇంకా బాగుండేదని మహిళలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.