గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. మీ కుటుంబ గొడవలు మీ ఇంటి వరకు పరిమితమయితే మంచిదని సినీ నటుడు మోహన్ బాబుకు సూచించారు. ఇంటి సమస్యలను పబ్లిక్ లో పెట్టడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని.. జర్నలిస్టుపై దాడి ఘటనను ఇలాగే వదిలేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని అన్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని, మోహన్ బాబు కుమారుడు ఆహ్వానించడం వల్లే వారి నివాసంలోకి జర్నలిస్టులు ప్రవేశించారన్నారు. మీ వైపు నుంచి పొరపాటు జరిగిందని గమనించి క్షమాపణలు చెప్పడం మంచిదని, గాయపడిన జర్నలిస్టును పరామర్శించడం కూడా ఉత్తమమని రాజా సింగ్ మోహన్ బాబుకు సూచించారు.
మోహన్ బాబు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా నటుడు మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలోచేరారు. విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఎడమ కంటి కింద గాయమయింది. నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి నేరుగా జల్ పల్లి లోని ఇంటికి చేరుకున్నారు