అల్పపీడనం ఎఫెక్ట్‌.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Rain Alert For Telangana. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు

By Medi Samrat  Published on  30 Aug 2021 9:02 AM GMT
అల్పపీడనం ఎఫెక్ట్‌.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో.. జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

గడిచిన 24 గంటల్లో కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌లలో 4.1 సెంటీమీటర్లు, కాంచన్‌బాగ్‌లో 4.0 సెంటీ మీటర్ల వర్షం పడింది. ఇక రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కుమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అటు ఏపీలోనూ జోరుగా కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు అధికంగానే పడుతున్నాయి.


Next Story