ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.
By అంజి Published on 23 Nov 2023 4:36 AM GMTఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేటి నుంచి 3 రోజులు వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 26 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 27వ తేదీ కల్లా అండమాన్ తీరంలో వాయుగుండంగా బలపడనుంది. 28న ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని, ఆ క్రమంలో బలపడి తుఫాన్ మారుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు.. ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు వాతావరణం ఉంది.
హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో పాటు చల్లటి గాలులు వీస్తున్నాయి. మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, మాసబ్‌ట్యాంక్, మీర్‌పేట్, బాలాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా.. రాబోయే రెండు, మూడు గంటల్లో మరిన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో వర్షం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వరంగల్‌తో పాటు పలు జిల్లాలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో పంటల విషయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 24 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సహా నగరంలోని మొత్తం ఆరు జోన్‌లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదనంగా, వారం పొడవునా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది, ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తమిళనాడులో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకూడి, టెన్‌కాశీ, విరుత్తునగర్, తేనీ, పుదుకొట్టై, కరైకల్, నీలగిరి జిల్లాల్లోని విద్యార్థులకు గురువారం సెలవు మంజూరు చేసింది. కాగా మరో ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.