వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది.. అందుకే కుల గణన : రాహుల్ గాంధీ
బోయిన్‌పల్లి కుల గణన సంప్రదింపులు వేదిక నుంచి ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందన్నారు.
By Medi Samrat Published on 5 Nov 2024 7:21 PM ISTటైటానిక్ పడవను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని 20 నిమిషాలలలో మునిగిపోయింది. ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతాది అంత లోతులో ఉండి కొంచమే బయటకు కనిపించింది.. అది తెలియక ఢీకొన్న పడవ కుప్ప కూలింది.. అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉందని ఏఐసీసీ అగ్ర నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బోయిన్‌పల్లి కుల గణన సంప్రదింపులు వేదిక నుంచి ఆయన మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందన్నారు.
మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం.. అందుకే కుల గణన అనేది అత్యంత కీలకం అన్నారు. కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలి.. ఏదైనా వ్యాధి తెలియాలంటే ఎక్స్‌రే చేయాలి కదా.. మేము కుల గణన చేస్తం.. ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే.. ప్రధాని మోదీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు.. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు.. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా అని ప్రశ్నించారు.
మేము దేశవ్యాప్తంగా కుల గణన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణలో కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు. తెలంగాణ కుల గణన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు.. ప్రజల నుంచి వారి ఆలోచినలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలన్నారు. తెలంగాణ కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.. ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు.. వివక్ష తొలగించి అందరికి అందరికి సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తామన్నారు.