ఆ డ‌బ్బు 2040 వరకూ ఏడాదికి రూ. 31వేలు చొప్పున‌ ప్రతీ కుటుంబానికి కట్టాలి : రాహుల్

ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

By Medi Samrat  Published on  31 Oct 2023 2:45 PM GMT
ఆ డ‌బ్బు 2040 వరకూ ఏడాదికి రూ. 31వేలు చొప్పున‌ ప్రతీ కుటుంబానికి కట్టాలి : రాహుల్

ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్‌లో జ‌రుగుతున్న పాలమూరు ప్రజా భేరి సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ఒకవైపు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. మరో వైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని.. దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో అందరూ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వంలో అతి పెద్ద మోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల లక్ష కోట్ల రూపాయలను దోచేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు, రైతులు, సామాన్య ప్రజల సొమ్ము ను దోచుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోతున్నయి. వాళ్ళు దోచుకున్న డబ్బుకు ప్రతి ఏడాది 2040 వరకూ 31వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సాగు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేన‌న్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వీళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చూడండని ప్ర‌జ‌ల‌తో అన్నారు.

దళితులు, ఆదివాసీలు, పేదల భూములు కాంగ్రెస్ నేతృత్వంలో తిరిగి ఇచ్చామ‌న్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని భూములు ఇస్తే వాటిని ధరణి పేరుతో గుంజుకుంటున్నారు. వారి కుటుంబానికి, బంధువులకు, ప్రజా ప్రతినిధులుకు మాత్రమే ధరణి లబ్ధి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సొత్తు కేసీఆర్ కుటుంబ సభ్యులకే చేరుతోందన్నారు.

రెవెన్యూ, ఇసుక, మద్యం అన్ని శాఖలు ఆ కుటుంబం వద్దే ఉన్నాయన్నారు. ప్రజా తెలంగాణ కొరకు మనం పోరాడాం.. దొరల తెలంగాణ కోసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేయబోతుందన్నారు. బీజేపీ, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. లోక్ సభలో లో బీజేపీ కి కేసీఆర్ పూర్తి మద్దతు ఇచ్చారు. జీఎస్టీ, రైతు చట్టాల బిల్లులకు బీజేపీకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పై ఎలాంటి కేసులు ఉండవన్నారు. ఈ రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్ పార్టీనీ ఓడించడమేన‌న్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీజేపీ కోసం ఎంఐఎం పార్టీ పనిచేస్తోందన్నారు.

తెలంగాణ ప్రజలు మనసులో నిర్ణయం తీసుకున్నారు. అధికారం, మీడియా సీఎం వెంట ఉంటే.. ప్రజల విశ్వాసం కాంగ్రెస్ కు ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యర్తలు ఎవరికీ భయపడరు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కలిసి ప్రజా తెలంగాణ సాకారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మన‌ది రాజకీయ బంధం కాదు కుటుంబ బంధం అని అన్నారు. ఇందిరా గాంధీకి అత్యవసర పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని.. ఈ నిజాన్ని నేను ఎప్పటికీ మరవలేనన్నారు. మీ పోరాటాన్ని చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చార‌ని పేర్కొన్నారు.

అన్ని వర్గాలకు తెలంగాణ ప్రయోజనాలు దక్కుతాయని ఆశించాం.. కేవలం ఒకే కుటుంబం ఆ ప్రయోజనాలు అన్ని అనుభవిస్తోందన్నారు. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామ‌న్నారు. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఇలా కాంగ్రెస్ అధికారం పొందిన రాష్ట్రాల్లో మొదటి కేబినెట్ భేటీ లోనే హామీలపై నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము సీఎం కేసీఆర్ ఎంత దోచుకున్నాడో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ సొమ్మును ప్రజలకు చెందేలా చేస్తామ‌న్నారు.

Next Story