ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపికి రఘునందన్రావు ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

By Medi Samrat  Published on  27 March 2024 2:30 PM GMT
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపికి రఘునందన్రావు ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో సంబంధం ఉన్న‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేశార‌ని.. నా ఫోన్ తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశార‌ని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశార‌ని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు దుబ్బాక ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న హరీష్ రావుతో పాటు అప్ప‌టి కలెక్టర్ ను ముద్దాయిలుగా చేర్చాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ డివైస్ లను కొనుగోలు చేసింది ఎవ్వరో.. నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరిన‌ట్లు తెలిపారు. సబితా ఇంద్రా రెడ్డిపై పోటీ చేసిన వారి నెంబర్ కూడా ట్యాపింగ్ చేశార‌ని ఆరోపించారు.

హైకోర్టు జడ్జ్ ల ఫోన్ లు కూడా విన్నారని కూడా తెలిసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఈరోజు తెలంగాణ కు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం CJI కి చెప్పాలంటూ తెలంగాణ న్యాయ‌మూర్తుల‌ను కోరారు. సినిమా పరిశ్రమలలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులు చేసి డబ్బులు వసూలు చేశార‌ని ఆరోపించారు. డీజీపీని సమగ్ర విచారణ జరిపించాలని కోరామ‌ని.. లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామ‌ని తెలిపారు.

Next Story