అప్ప‌టివ‌ర‌కూ ఆందోళనలు ఆపేది లేదు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Protests would continue till Centre procures paddy of Telangana. యాసంగి సీజన్‌లో తెలంగాణలో పండిన వరి పంటను పూర్తిగా సేకరించాలని

By Medi Samrat  Published on  8 April 2022 11:33 AM GMT
అప్ప‌టివ‌ర‌కూ ఆందోళనలు ఆపేది లేదు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

యాసంగి సీజన్‌లో తెలంగాణలో పండిన వరి పంటను పూర్తిగా సేకరించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్‌లోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు టీఆర్‌ఎస్‌ ఆందోళనలు ఆపేది లేదని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, పంజాబ్‌ తరహాలో తెలంగాణ నుంచి వరిధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని బీజేపీ రాష్ట్ర నాయకులను డిమాండ్‌ చేశారు.

మరోవైపు చెన్నూరు మున్సిపాలిటీలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. వరి సేకరణకు కేంద్రం నిరాకరించిందని, తెలంగాణ వరి పండించే రైతులను మోసం చేయడంలో తక్కువేమీ లేదని ఆయన మండిపడ్డారు. కాషాయ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ వరి ఉత్పత్తులను కొనుగోలు చేయరాదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నిరసనల్లో భాగంగా మున్సిపాలిటీల్లో మోటర్‌బైక్ ర్యాలీలు నిర్వహించగా, ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ ఇళ్లపై నుంచి నల్లజెండాలు ఎగురవేశారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఏ రేఖా నాయక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.










Next Story