బీజేపీకి మరో నేత రాజీనామా చేశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి లేఖను పంపారు. అంతర్గత గ్రూపు రాజకీయాలతో విసిగిపోయి.. నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను మోయలేక.. భారమైన మనసుతో, తీవ్ర నిరాశతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. 2016 నుంచి తాను పార్టీలో ఎంత కష్టపడ్డది లేఖలో వివరించారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా నిన్న బీజేపీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతూ వచ్చింది బీజేపీ. గత కొంతకాలంగా ఆ పార్టీలోని పరిస్థితులు చూస్తుంటే.. కీలక నేతలు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీనే సరైన వేదిక అని భావించి.. చాలా మంది నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీ - బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారంతో పాటు పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా కూడా నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.