ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం

ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయన గత మూడు రోజులుగా తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

By Medi Samrat  Published on  27 Nov 2023 9:37 PM IST
ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం

ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయన గత మూడు రోజులుగా తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోజు కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ప్ర‌చారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ చివ‌ర‌గా సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకూ నిర్వ‌హించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. రెండు కిలో మీటర్ల మేర ఈ రోడ్డు షో సాగింది. రోడ్డు షో లో ప్ర‌ధాని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు.

రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత ప్ర‌ధాని మోదీ వీరసావర్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షో అనంతరం కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. రోడ్డు షోతో తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయ‌న‌ ఢిల్లీకి వెళ్లనున్నారు.

Next Story