తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ ప్రభంజనంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు రోజు రోజుకూ పెరుగుతోందన్నారు.

By అంజి  Published on  18 March 2024 12:47 PM IST
Prime Minister Modi, Telangana , BJP, NDA

తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ ప్రభంజనంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. భారత్‌ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పదేళ్లలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీకి మరోసారి ఓటు వేయాలని కోరారు. మరోసారి తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు ఇవ్వాలన్నారు. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

అధికారంపైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన కామెంట్స్‌పై ప్రధాని మోదీ ఫైర్‌ అయ్యారు. 'శక్తి (అధికారం)ని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోంది. భారతదేశం మొత్తం శఖ్తిని ఆరాధిస్తుంది. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్‌ 4న తెలుస్తుంది. నేను భారతమాత పూజారిని. శక్తి స్వరూపులైన మహిళల రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు నేను సిద్ధం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాని ప్రధాని మోదీ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రజలను దోచుకుందన్నారు.

లిక్కర్‌ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుందని, ఆ పార్టీ చేసిన అవినీతిపై కాంగ్రెస్‌ దర్యాప్తు చేయడం లేదన్నారు. దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోందని, తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో మేం అధికారంలో ఉండి ఉంటే తెలంగాణ అభివృద్ధికి సహకరించి ఉండేవాళ్లం. బీఆర్‌ఎస్‌పై మీ ఆవేశం విధానసభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు, ఆవేశాన్ని సజీవంగా ఉంచుకోండి మరియు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా చేయండి” అని ప్రధాని మోదీ అన్నారు.

Next Story