ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్.. అనుసరించాల్సిన ప్రణాళికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే పీకే టీఆర్‌ఎస్‌తో జతకట్టినట్లు కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, జాతీయ రాజకీయాలలోని వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ నేరుగా పర్యవేక్షిస్తారని రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ప్రశాంత్ కిషోర్ తెలంగాణ పర్యటన ప్రారంభమైంది.
ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ నిన్న ప్రకాష్ రాజ్ తో కలిసి మల్లన్న సాగర్ లో పర్యటించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, మార్చి 10న జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహం రచించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. దీనికి సంబంధించి ఐపాక్ టీమ్ సభ్యులు ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వేను పూర్తి చేశారని.. దీనిపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు కూడా ప్రశాంత్ కిషోర్ సూచనలు చేస్తారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా మారారు. ప్రశాంత్ కిషోర్ అధికార పార్టీ తరపున పనిచేస్తుండగా.. ఆయనతో సన్నిహితంగా పనిచేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్నారు. కాగా, కేసీఆర్ సూచన మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్‌ను సందర్శించారని తెలుస్తోంది. పీకే రంగంలోకి దిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకున్నట్లు సమాచారం. మార్చి 10న 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో పీకే టీమ్ ల్యాండ్ అవుతుందని.. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం.