తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు (రిటైర్డ్ ఐపీఎస్) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో అంతర రక్షణ (ఇంటీరియర్ ప్రొటెక్షన్) మరియు ముందస్తు బెయిల్ (అంటిసిపేటరీ బెయిల్) ఇవ్వకుండా హైకోర్టు తిరస్కరించడాన్ని ఆయన సవాల్ చేశారు.
ఈ పిటిషన్‌ను SLP (క్రిమినల్) నెం. 7354/2025 — టి. ప్రభాకర్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణగా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుపై 2026 జనవరి 16న న్యాయమూర్తులు బి.వి. నాగరత్న మరియు ఉజ్జ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు కోర్టు నెం. 04లో, ఐటెం నెం. 301గా లిస్ట్ అయింది.
హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పాటు, ఎలాంటి అంతర రక్షణ కూడా ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంతో, ఈ కేసు అత్యున్నత న్యాయస్థానానికి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావుపై నమోదైన ఆరోపణలు, దర్యాప్తు విధానం, అరెస్ట్ భయం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు దర్యాప్తు దిశపై, అలాగే ఇతర నిందితులపై తీసుకునే చర్యలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.