ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమే : మంత్రి ఉత్తమ్

గోదావరి-బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలు పెట్టిందే బీఆర్ఎస్‌ పాలనలో అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

By Medi Samrat
Published on : 1 July 2025 9:15 PM IST

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమే : మంత్రి ఉత్తమ్

గోదావరి-బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలు పెట్టిందే బీఆర్ఎస్‌ పాలనలో అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నాటి తెలంగాణా-ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చర్చలు జరిపారు. బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలోనే ఈ మోసానికి పునాది పడిందన్నారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారని గుర్తుచేశారు. 2018 మార్చి, జూన్,సెప్టెంబర్ లలో ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా జి.ఓ లు ఇచ్చినా నాటి ముఖ్యమంత్రి నోరు మెదప లేదన్నారు. జీ. ఓ.యం.ఎస్ 98 పేరుతో నిధులు మంజూరు చేసినా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డు చెప్పలేదన్నారు.

గోదావరి జలాలు కృష్ణా, పెన్నా నదికి మళ్లించేందుకు ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపిందే కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాల నడుమ అధికారులు-నిపుణులతో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసిందే నాటి బీఆర్ఎస్‌ పాలకులు.. అన్నీ ఒప్పందాలు కుదుర్చుకున్న వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని బ‌ద్నాం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే సమర్థవంతంగా ఎదుర్కొన్నాము.. గోదావరి జలాశయాలలో తెలంగాణా నీటి వాటా కాపాడుకునేందుకు ఆంధ్ర‌ప్రదేశ్ ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించామ‌న్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను స్వయంగా కేంద్రానికి వివరించినందునే.. ఈ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించారని.. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విజయమేన‌న్నారు.

Next Story