ఆ నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్ ద్వారా కల్పిస్తాం
By Medi Samrat Published on 6 Sept 2023 5:32 PM ISTతెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలకు పెద్ద పీట వేయాలని నిర్ణయం చేశామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యకు పెద్ద పీట వేయాలని భావించామని.. బీసీలు తెలంగాణ వచ్చాక విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. బలహీనవర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. బలహీనవర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులు లేవని అన్నారు. రాజకీయంగా.. తగిన సీట్లు కేటాయించాలని నిర్ణయం చేశామని.. ఇప్పటికే పీఏసీలో నిర్ణయం మేరకు సీట్లు కేటాయించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్ ద్వారా కల్పిస్తామన్నారు.
బీసీ డిక్లరేషన్ పై ఇటీవల పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేసింది పీసీసీ. బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ పని చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా ప్రకటించింది కాంగ్రెస్. ఈ కమిటీకి మరో 9 మంది అడ్వైజరీలను నియమించింది.