ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన గర్జన సభ ద్వారా జులై 2న కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరై పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు 6 నెలల పాటు ఓ వైపు ఆత్మీయ సమ్మేళనాలు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చిన పొంగులేటి.. తన భవిష్యత్‌కు కాంగ్రెస్ పార్టీనే సరైనదిగా భావించి పార్టీలో చేరారు. అయితే పొంగులేటి పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్‌లో ఆయన పోషించే రోల్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవిని అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.
పొంగులేటిని టీపీసీసీ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా నియమించింది. మధుయాస్కీ గౌడ్ ఇప్పటికే టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ కమిటీకి పొంగులేటిని కో ఛైర్మన్‌గా నియమించింది. 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించిన అధిష్టానం.. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.
.