యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఎర్రవల్లి తన నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కేసీఆర్‌కుతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.
ఇక సోమాజీగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. మంత్రి వెంకట్‌రెడ్డి కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో డిసెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి రాగానే.. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనను రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు.