గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న ముంబైలోని దాదర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మంగళ్‌హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
మంగళ్ హాట్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని నిజాం పాలిస్తున్నారని ఆరోపించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మళ్లీ జైలుకు పంపినా భయపడేది లేదన్నారు. తాను ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోహత్య, మత మార్పిడులు, లవ్ ఆఫ్ జిహాద్‌ను అరికట్టేందుకు చట్టాలు తీసుకురావాలని కోరాను. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయని ప్రశ్నించారు. ఇక ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే తెలంగాణ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు.
కాగా.. గతేడాది వివాదాస్పద వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇదే తరహా కేసులు రాజాసింగ్‌పై నమోదు కావడంతో పీడీ యాక్ట్‌ను నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద గత ఆగస్టులో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు విధించిన షరతుల్లో ఉంది.