బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అరెస్ట్

దుబ్బాకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on  5 July 2023 3:51 PM IST
Raghunandan Rao, BJP, Arrest, Telangana

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అరెస్ట్

దుబ్బాకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్.. హైదరాబాద్‌ నుంచి సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌కు వెళ్తుండగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌ను అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల గజ్వేల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షన జరగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గజ్వేల్‌ పట్టణంలో ఉన్న శివాజీ విగ్రహం దగ్గర ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేశారు. ఈ ఘటనే ఉద్రిక్తతకు కారణమైంది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని అక్కడున్న స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ క్రమంలోనే ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సందీప్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘటనతో గజ్వేల్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల దృష్ట్యా రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే రఘునందన్‌కు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు. రఘునందన్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Next Story