ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు
PM Modi Visits Telangana on 13th february.తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2023 2:03 PM ISTతెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
వాస్తవానికి ప్రధాని ఈ నెల 19నే తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. అయితే.. కొన్ని కారణాల వల్ల పర్యటన రద్దైంది. అయినప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు.
ఆ సమయంలో ప్రధాని తెలంగాణ పర్యటన తప్పక ఉంటుందని, త్వరలోనే తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్నట్లుగానే ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పీఎంవో వెల్లడించింది.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బావిస్తోంది. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలో పార్టీలోని ముఖ్య, సీనియర్ నేతలు అంతా తెలంగాణలో వరుసగా పర్యటించేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి బిఎల్ శర్మ శనివారం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మెదక్ పార్లమెంట్ పరిధిలో, ఈ నెల 23, 24 తేదీల్లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వీరు వివరించనున్నారు.
ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నేతలు పర్యటించేలా, సభలు, సమావేశాలతో ప్లాన్స్ రెడీ చేసుకుంది భారతీయ జనతా పార్టీ.