రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది : మంత్రి తలసాని

PM Modi unfit to talk about equality. సమానత్వం గురించి మాట్లాడేందుకు ప్రధాని మోదీ అనర్హుడని పశుసంవర్థక శాఖ మంత్రి

By Medi Samrat  Published on  7 Feb 2022 8:30 PM IST
రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది : మంత్రి తలసాని

సమానత్వం గురించి మాట్లాడేందుకు ప్రధాని మోదీ అనర్హుడని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దేశంలో అసమానతలను రూపుమాపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని.. ఇటీవల హైదరాబాద్‌లో ప్రధాని చేసిన ప్రకటనపై మంత్రి తలసాని ద్వజమెత్తారు. మోదీ దేశంలో అసమానతలను ప్రోత్సహిస్తున్నారని.. సమానత్వాన్ని కాదని.. ఈ అంశంపై మాట్లాడేందుకు ఆయన అనర్హుడని ఆరోపించారు. ఆదివారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో జిల్లా కేంద్రంలో మృతి చెందిన కేటీపీఎస్ 1104 ట్రేడ్ యూనియన్ వ్యవస్థాపకుడు సంగం జంగయ్యగౌడ్‌కు నివాళులర్పించేందుకు శ్రీనివాస్ యాదవ్ సోమవారం పాల్వంచ‌కు వచ్చారు.

మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. బడ్జెట్‌లో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధుల కేటాయింపు చేయించ‌డంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ము ఉంటే తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరుతూ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీలకు న్యాయం జరిగేలా రాజ్యాంగంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేకలు వేస్తూ ఘాటుగా స్పందించారని.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజ్యాంగ సవరణకు 11 మంది సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేశారని.. 100 సార్లు రాజ్యాంగాన్ని సవరించారని గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచిన అరుణ్ శౌరీ లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చింది బీజేపీయేన‌ని. రాజ్యాంగ సవరణ చేయాలన్న ముఖ్యమంత్రి డిమాండ్‌ను బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుగా చూపి అంబేద్కర్‌ను అవమానించేలా చూస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసత్వం టీఆర్‌ఎస్‌ పార్టీయేనన్నారు. అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం దళిత బంధు, సబ్‌ప్లాన్ వంటి పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగాకాంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.




Next Story